టీడీపీ నేత చింతకాయల విజయ్‌పై ఏపీ సీఐడీ కేసు నమోదు

టీడీపీ నేత చింతకాయల విజయ్‌పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసారు. ఈనెల 6న 10 గంటల 30 నిమిషాలకు మంగళగిరిలోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 66(c), సెక్షన్ 419, 469, 15 (a) 505(2), 120(b)r/w 34 IPC కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్స్, మొబైల్ ఫోన్స్‌తో పాటు.. ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌తో సహ హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆదేశించారు. హాజరుకాని పక్షంలో.. 41A(3), (4) సీఆర్‌పీసీ ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లోని చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు.

పోలీసులు వచ్చిన సమయంలో.. విజయ్ ఇంట్లో లేరు. ఇక ఏపీ పోలీసుల వ్యవహారశైలిపై విజయ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వచ్చారో, కేసు ఏంటో కూడా చెప్పలేదని ఆరోపించారు కుటుంబ సభ్యులు. ఇంట్లో పిల్లలు ఉన్న సయమంలో పోలీసుల పేరుతో హల్‌చల్ చేశారని, అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియదని వారు అంటున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు నిర్వహించాలని తమను బెదిరించినట్లు విజయ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.