న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్!

Chris Hipkins To Be New Zealand PM After Jacinda Ardern Decides To Quit

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ఆ దేశ విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక కానున్నారు. జెసిండా ఆర్డెర్న్ స్థానంలో లేబర్ పార్టీ నుంచి క్రిస్ హిప్ కిన్స్ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయన ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీలు క్రిస్ హిప్ కిన్స్ ను అధికారికంగా ఎన్నుకుంటారు. ఈ సమావేశంలో క్రిస్ హిప్ కిన్స్ కు పార్టీ సభ్యుల మద్దతు లభిస్తే న్యూజిలాండ్ 41వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. క్రిస్ హిప్‌కిన్స్ ప్రస్తుతం పోలీసు, విద్య, ప్రజా సేవల శాఖ మంత్రిగా ఉన్నారు. క్రిస్ హిప్‌కిన్స్ మొదటిసారిగా 2008లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2020 నవంబర్ లో కొవిడ్ నిరోధక శాఖ మంత్రిగా పనిచేశారు. కరోనా కట్టడిలో హిప్ కిన్స్ కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందారు.

కాగా, న్యూజిలాండ్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికార లేబర్‌ పార్టీ సమావేశంలో ఆమె ప్రకటించారు. ఈ నెల 22న లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడి ఎన్నిక ఉంటుందని చెప్పారు. 2023 అక్టోబర్‌ 14న సాధారణ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ తప్పక గెలుస్తుందని ఆర్డెర్న్ ధీమా వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/