యువకుడికి ప్రాణం పోసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను అభినందించిన మెగాస్టార్

సీపీఆర్ తో యువకుడి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. శుక్రవారం ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన బాలరాజు అనే యువకుడు ఆరం ఘర్ చౌరస్తా వద్ద సడెన్ గా కుప్పకూలాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అతనికి సీపీఆర్ చేశాడు. అతని చాతి బాగాన అరచేతితో గట్టిగా నొక్కాడు. ఆ యువకుడు స్పృహలోకి వచ్చేంతవరకు గట్టిగా అదిమాడు. దీంతో ఆ యువకుడికి మెలకువ రాగానే చుట్టుపక్కల వారు గమనించి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అనంతరం ఆయనని మెరుగైన వైద్యం నిమిత్తం అత్తాపూర్ లోని జర్మన్ టెన్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి మెరుగైన వైద్యం అందించిన వైద్యులు సరైన సమయానికి సిపిఆర్ చేయడంతోనే ఆయన ప్రాణాలు నిలిచాయని తెలిపారు.

దీంతో కానిస్టేబుల్ సిపిఆర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ” కానిస్టేబుల్ రాజశేఖర్ కు సెల్యూట్. మీరు స్పందించిన తీరు, సమయానికి చేసిన సిపిఆర్ ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. మీరు మీ కర్తవ్యాన్ని మించి, సాటి మనిషి పట్ల కనికరం చూపడంలో మీరు మానవత్వానికి, ఫ్రెండ్లీ పోలీసులకు ఉదాహరణగా నిలిచారు” అంటూ కానిస్టేబుల్ రాజశేఖర్ పై ప్రశంసలు కురిపించారు.