మొగిలయ్య కు ‘మెగా’ సాయం..

‘బలగం’ సింగర్‌ మొగిలయ్య కు మెగా సాయం అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చారు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌, ఆక్సిజన్‌ బ్యాంక్‌లు ఏర్పాటు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ‘తోడుగా మా తోడుండి’ అనే పాట ప్రతీ ఒక్కరిని కన్నీరుపెట్టిస్తుంది. ఈ పాటే సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టి కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే ఆ పాట పాడిన గాయకుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి చాల దారుణంగా ఉంది.

కరోనా తర్వాత ఈయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. సినిమా తర్వాత కళ్లు కూడా కనిపించట్లేదు. వైద్యం చేయించుకునేందుకు మొగిలయ్య ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. షుగర్, బీపీ వల్ల వైద్యం చేయడం క్రిటికల్ గా మారింది. ఇప్పటికే 10 ఆపరేషన్లు జరిగాయి. దీంతో మొగిలయ్య పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి..నిమ్స్ లో ఆయనకు ప్రభుత్వం చికిత్స చేయిస్తుంది. కాగా మొగిలయ్యకు దీర్ఘాకాలిక మధుమేహం ఉండడంతో కంటిచూపు కూడా మందగించింది. నిమ్స్‌లో కంటి వైద్య నిపుణులు కూడా ఆయనను పరీక్షించారు. అయితే మొగిలయ్య దీన పరిస్థితి విషయం తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి ఆయనకు తిరిగి కంటి చూపు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈక్రమంలో బలగం డైరెక్టర్‌ వేణుకి ఫోన్‌ చేసి మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని ఆయనకు కంటి చూపు వచ్చేలా చేద్దామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేణు మొగిలయ్య దృష్టికి తీసుకువెళ్లారట. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ మొగిలయ్య దంపతులను ఇంటర్వ్యూ చేయగా మెగాస్టార్‌ సాయం విషయం వెలుగులోకి వచ్చింది.