సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ

కారును పోలిన గుర్తులపై బిఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

supreme court rejects BRS plea seeking removal of car-like symbols for Telangana elections

న్యూఢిల్లీః ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దంటూ తెలంగాణ అధికార పక్షం బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులు కారు గుర్తును పోలి ఉన్నాయని, దీని వల్ల ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతోందని అదివరకే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన బిఆర్ఎస్ పార్టీ… అదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి ఎన్నికల గుర్తులను ఎవరికీ కేటాయించకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.

బిఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారించింది. సాధారణ ఎన్నికల గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా, ఓటర్లేమీ రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కారు గుర్తుకు తేడా తెలుసుకోలేనంత అమాయకులేమీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.