మరికాసేపట్లో అయోధ్య లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట

ఎన్నో ఏళ్లుగా కంటున్న కల తీరుతున్న శుభ సందర్భంలో ప్రపంచం మొత్తం అయోధ్యవైపే చూస్తోంది. భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం అయోధ్య లో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. మధ్యాహ్నం 12.29కి బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటూ… 4వేల మంది సాధువులు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ.. బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ మహా కార్యక్రమం కోసం దేశం, విదేశాల నుంచి సెలబ్రిటీలు అయోధ్యకు వచ్చారు. లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా లైవ్ ప్రసారం అవుతోంది. అన్ని రైల్వే స్టేషన్లలో లైవ్ ఇస్తున్నారు. ఈ మహా కార్యక్రమం కోసం 13వేల మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. అలాగే 10వేల సీసీ కెమెరాలు, యాంటీ మైన్ డ్రోన్లూ ఉన్నాయి. వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు, NDRF, వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి.