చైనాతో టిబెట్‌ సమస్యలపై చర్చించేందుకు సిద్ధం : దలైలామా

Chinese want to contact me: Dalai Lama says open to talks on Tibetan problems

న్యూఢిల్లీః ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా తాను టిబెట్‌ సమస్యలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని అన్నారు. తనను సంప్రదించేందుకు ఆ దేశం ప్రయత్నించిందన్నారు. టిబెట్ ప్రజల ధైర్యాన్ని ఇప్పుడు డ్రాగన్‌ గుర్తించిందన్న ఆయన.. అందుకే టిబెట్ సమస్యల పరిష్కారానికి చైనా నేతలు తనను సంప్రదిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ-లడఖ్‌కు బయలుదేరే ముందు దలై లామా ధర్మశాలలో పాత్రికేయులతో సంభాషించారు. టిబెట్ చాలా ఏళ్లుగా చైనా అధీనంలో ఉంది. మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి. టిబెట్‌పై చైనా అణచివేత విధానాలను అవలంబిస్తోంది.

అయితే, ఇప్పుడు చైనా తన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటోంది. చైనా ఇప్పుడు మారుతోంది. టిబెట్‌పై అణచివేత వైఖరిని అవలంబిస్తున్న నేతలపైనా నాకు కోపం లేదని దలైలామా అన్నారు. చైనా చారిత్రకంగా బౌద్ధ దేశమని, అక్కడ ఉన్న బౌద్ధ విహారాలు, దేవాలయాలు ఇందుకు నిదర్శనమన్నారు. మఠాలు, దేవాలయాలను కూడా సందర్శించిన వారు నా వద్ద ఉన్నారన్నారు. టిబెట్ సంస్కృతి, మతం గురించిన పరిజ్ఞానం ప్రపంచం మొత్తానికి మేలు చేస్తుందని దలైలామా తెలిపారు. తాను ఇతర మతాలను, వారి సంప్రదాయాలను సైతం గౌరవిస్తానన్న ఆయన.. ప్రేమ, కరుణను వ్యాప్తి చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అనుచరులందరికీ సందేశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.