భార‌త్‌కు రానున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి

china-foreign-minister-wang-may-visit-india-this-month

హైదరాబాద్: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ నెల‌లోనే భారత్ కు రానున్నటు తెలుస్తోంది. అయితే తేదీలు కుదరాల్సి ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. భార‌త్‌కు రావ‌డానికి ముందు ఆయ‌న నేపాల్‌లోనూ ప‌ర్య‌టించ‌నున్నారు. భారత్ తో పాటు, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్థాన్ లోనూ ఆయన పర్యటించొచ్చని వెల్లడించాయి.

చైనా విదేశాంగ మంత్రి పర్యటన ఖరారైతే.. 2020 తర్వాత ఇరు దేశాల మధ్య అత్యున్నతస్థాయి సమావేశం ఇదే అవుతుంది. 2020 మే నెలలో గల్వాన్ లోయ వద్ద భారత్ సరిహద్దు ప్రాంతంలోకి చైనా సైనికులు చొచ్చుకుని రావడం, నిలువరించిన భారత సైనికులపై దాడి చేయడం గమనార్హం. భారత సైనికులు కూడా గట్టిగా బదులిచ్చారు. నాడు 20 మంది భారత జవానులు ప్రాణాలు కోల్పోగా.. చైనా వైపు రెట్టింపు సంఖ్యలో సైనికులు మరణించి ఉంటారని అంచనా.

కాగా, చైనా-భారత్ మధ్య సయోధ్య దిశగా అడుగులు పడుతున్నాయి. 2020లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత నుంచి భారత్, చైనా మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతినడం తెలిసిందే. నాటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి సైనిక కమాండర్ల స్థాయిలో 15 విడతలుగా చర్చలు జరిగాయి. అయినా అంగీకారం కుదరలేదు. సరిహద్దు ఒప్పందాలను బీజింగ్ గౌరవించకపోవడమే.. ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై ప్రకటించారు. ఈ క్రమంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ భారత్ కు రానుండడం ప్రాధాన్యతతో కూడినదే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/