ప్రజల తీర్పును గౌరవించాలని పాక్ పార్టీలకు వైట్ హౌస్ పిలుపు

biden-reaction-on-pakistan-election-results

వాషింగ్టన్‌ః పాకిస్థాన్ లో ఇటీవల జరిగిన ఎన్నికలు, ఫలితాల ప్రకటన తర్వాత చోటుచేసుకుంటున్న ఘటనలపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. ఇటీవల నిర్వహించిన ఎన్నికలలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కేరిన్ జీన్ పియరే మాట్లాడుతూ.. పాకిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ప్రెసిడెంట్ జో బైడెన్ కు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్న పాక్ ప్రజలకు బైడెన్ అభినందనలు తెలిపారని గుర్తుచేశారు. ఫలితాల ప్రకటన సందర్భంగా, ఫలితాలు వెల్లడించాక చోటుచేసుకున్న ఘటనలపై బైడెన్ విచారం వ్యక్తం చేశారని చెప్పారు.

ఏ పార్టీకి ప్రజలు పూర్తి మెజారిటీ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని బైడెన్ పాకిస్థాన్ లోని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారని తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ మిగతా పార్టీలతో కలిసి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో పాటు ఇతరత్రా చిన్న చిన్న పార్టీలతో ఈమేరకు ఒప్పందం కుదిరిందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.