ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న రెండో దశ పోలింగ్‌

Chhattisgarh Assembly Elections… Second phase of polling is going on

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మొత్తం 90 స్థానాల్లో ఈ నెల 7న మొదటి దశలో భాగంగా 20 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 70 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతున్నది. మొత్తం 22 జిల్లాల్లో విస్తరించిన ఈ 70 సీట్లలో 958 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,63,14,479 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం ఓటర్లలో 81,72,171 మంది మహిళలు ఉండగా, 684 మంది థర్డ్‌ జెండర్లు ఉన్నారు. మొత్తం 18,833 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటుచేశారు. బింద్రనవగఢ్‌ నియోజకవర్గంలోని తొమ్మిది పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ ముగుస్తుంది.

రెండో దశ పోలింగ్‌లో సీఎం భూపేష్‌ బఘేల్‌, డిప్యూటీ సీఎం టీఎస్‌ సింఘ్‌దేవ్‌, మరో 8మంది మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలున్నాయి. అధికార కాంగ్రెస్‌, విపక్ష బిజెపి మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో క్రితం సారి 50 చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించగా, 13 సీట్లలో బిజెపిగెలుపొందింది. మరో నాలుగు స్థానాలను జనతా కాంగ్రెస్‌, రెండు సీట్లలో బీఎస్పీ చేజిక్కించుకున్నాయి.