తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ఫిజికల్ ఈవెంట్స్ లో మార్పులు..

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ అందజేసిన సంగతి తెలిసిందే. పోలీసు ఉద్యోగాలకు సంబదించిన నోటిఫికేషన్ ను సోమవారం విడుదల చేసింది. కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పోలీసు నియామక మండలి జారీ చేసిన నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. మొత్తం 16,027- కానిస్టేబుల్‌, 587- ఎస్‌ఐ పోస్టులకు నియామాక మండలి నోటిఫికేషన్​ విడుదల చేసింది. అయితే ఈసారి నోటిఫికేషన్ లో భారీ మార్పులు చేసింది.

గతంలో లాగా రన్నింగ్ పురుష అభ్యర్థులకు 100 మీటర్స్, ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ నిర్వహించడం లేదు. ప్రస్తుతం పురుషులకు 1600 మీటర్లు (7 నిమిషాల 15 సెకన్లు), ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు 9 నిమిషాల 30 సెకండ్ల పరుగు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు లాంగ్ జంప్ 4 మీటర్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు మూడున్నర మీటర్లు, షార్ట్ పుట్ 6 మీటర్లుగా నిర్వహిస్తున్నారు. మహిళలకు ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తున్నారు. మహిళల లాంగ్ జంప్ 2.50 మీటర్లు కాగా షార్ట్ పుట్ నాలుగు మీటర్ల గా నిర్వహిస్తున్నారు. దీనిని గమనించగలరు.

ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే… ఎస్ఐ పోస్టులు 587 ఉండగా.. కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉన్నాయి. వీటన్నింటికీ నోటిఫికేషన్​విడుదలైంది. ఇందులో కానిస్టేబుల్ (సివిల్​) 4965, కానిస్టేబుల్ (ఏఆర్​)- 4423, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ 5010 ఐటీసీ కానిస్టేబుల్ 262, కానిస్టేబుల్ (డ్రైవర్​) 100, కానిస్టేబుల్ (మెకానిక్) పీటీవో 21, కానిస్టేబుల్(ఎస్​ఏఆర్​సీపీఎల్​) 100 ఉన్నాయి. ఇంకా సబ్ ఇన్ స్పెక్టర్ (సివిల్) 415, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ పోలీస్ (ఏఆర్​)-69, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ)- 23, సబ్ ఇన్ స్పెక్టర్ (ఐటీసీ)- 23, సబ్ ఇన్ స్పెక్టర్ (పీటీవో), రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్​ఏఆర్​సీపీఎల్) 05 ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎఫ్​పీబీ)- 08, సైంటిఫిక్ ఆఫీసర్ (ఎఫ్​ఎస్​ఎల్) 14, సైంటిఫిక్ అసిస్టెంట్( ఎఫ్ఎస్ఎల్), ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ 01 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. వీటితో పాటు స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్‌కు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ 390, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SPF)-12 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే 2వ తేదీ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. నియమ నిబంధనలు, గరిష్ఠ వయసు, విద్యార్హత, రుసుము, సిలబస్ తదితర వివరాలన్ని పోలీస్ నియామక మండలికి చెందిన వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచారు. అన్ని పోస్టులకు సంబంధించిన రుసుము విషయంలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీ ఇచ్చారు.ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోలీసు నియామక మండలి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.