పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారంటూ DK అరుణ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అరెస్ట్ ల పర్వం రాజకీయంగా వేడి రాజేసింది. ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల బిజెపి శ్రేణులు , కార్య కర్తలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు. మొహమ్మద్ ప్రవక్త పై రాజాసింగ్ విడుదల చేసిన వివాదాస్పద వీడియో పై పోలీసులు రాజా సింగ్ ని అరెస్టు చేయడం..లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందని ఆరోపిస్తూ నిన్న కవిత ఇంటిదగ్గర బిజెపి కార్యకర్తలు నిరసనకు దిగారు. వారి అక్రమ అరెస్టుకి నిరసనగా దీక్ష చేయాలని నేడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దీక్షకు దిగిన బండి సంజయ్ ని దీక్ష భగ్నం చేసి అరెస్టు చేశారు పోలీసులు. ఇలా ఇద్దరు కీలక నేతలను అరెస్ట్ చేయడం పట్ల బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నారు.

పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ ను ఆమె ఖండించారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పాదయాత్ర చేస్తున్న సంజయ్ ను తీసుకెళ్లడం దుర్మార్గమన్నారు. అక్రమ కేసులు, అరెస్టులకు కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సైతం వీరి ఆరెస్ట్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను టీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నందుకే తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అక్రమ కేసులు, అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు . బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంబయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టులను ఖండించారు. ఇద్దరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.