జూలై 14 సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజుః ప్రధాని మోడీ

Chandrayaan-3 mission will carry hopes and dreams of our nation: PM Modi

న్యూఢిల్లీ : చంద్రుడి గురించి తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేస్తున్న ప్రయత్నాల్లో మూడోదైన చంద్రయాన్-3 ప్రయోగం మరికాసేపట్లో జరగబోతోంది. యావత్తు ప్రపంచం దీనిని ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఇటువంటి ఉద్విగ్న, భావోద్వేగ క్షణాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు 2023 జూలై 14 అని తెలిపారు. మన మూడో లూనార్ మిషన్ చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని ప్రారంభించే రోజు ఇది అని వివరించారు. ఈ ప్రధానమైన మిషన్ మన దేశ ఆశలు, స్వప్నాలను మోసుకెళ్తుందని తెలిపారు.

కేంద్ర విద్యా శాఖ మత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన ట్వీట్‌లో, ఇస్రోను కరతాళ ధ్వనులు, కేరింతలతో ప్రోత్సహించే 140 కోట్ల మంది భారతీయుల్లో తానూ ఉన్నానని చెప్పారు. త్వరలోనే చంద్రునిపైన కలుద్దామని తెలిపారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి చంద్రయాన్-3 వ్యోమనౌకను ప్రయోగించబోతున్నారు.

కాగా, చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై 2023 ఆగస్టు 23/24 తేదీల్లో సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ విజయాన్ని సాధించిన నాలుగో దేశంగా భారత దేశం ఘనత సాధిస్తుంది. గతంలో అమెరికా, చైనా, సోవియెట్ యూనియన్ ఈ ఘనత సాధించాయి. అయితే చంద్రునిపై నీటి జాడ ఉందని కనుగొన్నది భారత దేశమే.