దేవుని సన్నిధిలో ఈ ‘గన్’ సంస్కృతి ఏంటి ?: చంద్రబాబు

chandrababu-tweets-on-controversy-over-j-gun-arch-at-tirupati-gangamma-temple

అమరావతిః ఏపీలో తాజాగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అలంకరణ వివాదంగా మారింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పూల అలంకారంపై మాటల తూటాలు పేలుతున్నాయి. జాతర సందర్భంగా సోమవారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా పూలతో ఆకర్షనీయంగా తోరణాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ ద్వారం వైపు వివిధ రంగులు పోలిన పూలమధ్యలో జె (J) అనే ఇంగ్లీస్ అక్షరం, గన్‌ (రివాల్వార్) బొమ్మలా డిజైన్ ఏర్పాటు చేశారు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేంటంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆలయ పరిసరాల్లో ఇలాంటివి సరికాదంటూ హితవు పలుకుతున్నారు.

అయితే ఈ పూల అలంకరణపై టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన ట్విట్టర్ హాండిల్‌లో ఈ ఫోటోతోపాటు కామెంట్ జోడించారు. ‘తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? దేవుని సన్నిధిలో ఈ ‘గన్’ సంస్కృతి ఏంటి ? వైఎస్‌ఆర్‌సిపి జెండా గుర్తులు ఏంటి? పిచ్చి పట్టిందా? ‘J’ అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలా? అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్ర బిజెపి నాయకులు కూడా మండిపడుతున్నారు. గంగమ్మ తల్లి ఆలయం దగ్గర ‘జె గన్‌’ రూపంలో పూలతో అలంకరించడం సరికాదన్నారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి. ఈ వివాదంపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.. ఈ తోరణం ఎవరు ఏర్పాటు చేశారన్నది తెలియాల్సి ఉంది.