ఏపీ రోడ్ల ఫై కేంద్ర మంత్రి ఆగ్రహం ..

ఏపీలో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటుచూసినా గుంతలే..ప్రధాన రోడ్డు దగ్గరి నుండి మారుమూల గ్రామానికి వెళ్లే రోడ్డు వరకు అన్నికూడా గుంతలే. ఆ రోడ్ల ఫై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే. మొదటి నుండి కూడా ప్రతిపక్ష పార్టీలు రోడ్లను బాగుచేయాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతూ వస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం రోడ్ల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి ఏపీలో రోడ్ల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ ఏపీ రోడ్ల దుస్థితిపై చేసిన ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు.

తన ట్వీట్ లో ఏపీ ప్రభుత్వంపై మురళీధరన్ విమర్శలు గుప్పించారు. ‘అనకాపల్లిలోని రోడ్ల దుస్థితిని చూడండి. వైయస్ జగన్ అభివృద్ధి మోడల్ అంటే ఇదేనా? ఈ రోడ్లపై ప్రయాణించడం ఒక శిక్షలాంటిది. ప్రజల ప్రాథమిక అవసరాలను కూడా జగన్ పట్టించుకోవడం లేదు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురంకు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టింది. షేమ్’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన చంద్రబాబు… వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులపై ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ… ప్రజలు మాత్రం రోడ్డు దాటలేకపోతున్నారని విమర్శించారు.