చరిత్రలో ఉన్న రాక్షసులందరినీ మించిన రాక్షసుడు జగన్: చంద్రబాబు

మార్పు దిశగా వైఎస్‌ఆర్‌సిపి నేతలు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడి

chandrababu-naidu-talks-about-ysrcp-leaders-being-joined-in-tdp

అమరావతిః సీఎం జగన్ పై టిడిపి అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ముందు బకాసురుడు కూడా తక్కువేనని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఉన్న రాక్షసులందరినీ మించిన రాక్షసుడు జగన్ అని అభివర్ణించారు. ఇప్పుడైనా మనం మారకపోతే మన జీవితాలు మారవని వైఎస్‌ఆర్‌సిపి నేతలు గుర్తిస్తున్నారని, అందుకే వారు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు వివరించారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ఓడితే రాష్ట్రం గెలిచినట్టు భావించాలని, రాష్ట్రం గెలుపు కోసం ప్రతి ఒక్కరూ గ్రామగ్రామానా కష్టపడాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌సిపి అరాచక పాలనలో, విశాఖలో ఇప్పుడు అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రారంభానికి ముందే పోలవరాన్ని సుడిగుండంలోకి నెట్టారని, గత టిడిపి ప్రభుత్వ ఐదేళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు.