ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు జిల్లాలోని ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటుంది. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేస్తుందని ప్రతిపక్షపార్టీలు మండిపడుతున్నాయి. బస్సు సౌకర్యం లేని గ్రామంలో 120 అడుగుల రోడ్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా తమ ఇళ్లను కూల్చేశారని స్థానికులు వాపోతున్నారు. జనసేన పార్టీ మీటింగ్ కు స్థలం ఇచ్చినందుకే ప్రభుత్వం ఇలా మా ఫై కుట్ర పన్నిందని , కావాలనే మా ఇళ్లను కూల్చేసింది వాపోతున్నారు. ఈ ఘటన పట్ల జనసేన అధినేత ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఈరోజు ఇప్పటంలో పర్యటిస్తున్నారు.

మరోపక్క ఇళ్ల కూల్చివేతలపై టిడిపి సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయి.. ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారన్నారు. ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. 600 ఇళ్లున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా? మీ దుర్బుద్ధి, రాజకీయ కక్ష ప్రజలకు అర్థం కాదు అనుకుంటున్నారా? మీవి రోడ్లు వేసే మొహాలేనా అంటూ మండిపడ్డారు. ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను అడ్డుకుంటేనో.. చీకట్లో తమ పర్యటనపై రాళ్లు వేస్తేనో ‘మీరు పైచేయి సాధించలేరు’ అన్నారు.