ప్రమాదానికి గురైన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పం పర్యటన లో భాగంగా ఉదయం ఆయన బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన కుప్పంకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు వారు యత్నించారు. ఈ క్రమంలో చంద్రబాబు చేతికి అనుకోకుండా స్వల్ప గాయమైంది. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి కుప్పంకు బయల్దేరి వెళ్లారు.

చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఫ్లెక్సీల చించివేతకు ప్రతీకారంగా వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేశారు. ఆర్అండ్‌బీ రోడ్‌ నుంచి కుప్పంలోకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను టీడీపీ శ్రేణులు చించివేశాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొడుతున్నారు. ప్రస్తుతం కుప్పంలో భారీ వర్షం పడుతోంది. చంద్రబాబు పర్యటనకు అంతరాయం ఏర్పడింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు.