ఏపీలో ఉన్మాది పాలన సాగుతోందని చంద్రబాబు ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫై నిప్పులు చెరిగారు. కుప్పం పర్యటన లో ఉన్న చంద్రబాబు ..ఈరోజు కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్మాది పాలన సాగుతోందని, రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిన్నటి కుప్పం ఘటన తానెన్నడూ చూడలేదన్నారు. వైస్సార్సీపీ రౌడీ మూకలతో దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు.

వైస్సార్సీపీ రౌడీ ప్రతాపాలు తన దగ్గర కాదు… జగన్‌ దగ్గర చూపించుకోవాలన్నారు. తానిచ్చిన ఇళ్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పులివెందులకు టీడీపీ హయాంలోనే నీళ్లు వచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. పేదల పొట్టకొట్టిన వైస్సార్సీపీ శ్రేణులకు మాట్లాడే అర్హత లేదన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే అన్న క్యాంటీన్‌పై దాడి జరిగిందన్నారు. పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం డీజీపీయేనని ఆరోపించారు.

ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మద్యాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని దుయ్యబట్టారు. బాబాయ్‌ వివేకను చంపిన వ్యక్తికి ఓట్లడిగే హక్కు లేదన్నారు. వైస్సార్సీపీ ఆరిపోయే దీపమని… ఇకపై జగన్ ఆటలు సాగవన్నారు.