గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు

టీడీపీ నేతలు ఈరోజు గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ ను కలిశారు. కుప్పంలో వైస్సార్సీపీ శ్రేణులు వ్యవహరించిన తీరు, అన్న క్యాంటీన్ ధ్వంసం చేయడాన్ని గవర్నర్‌కు వివరించారు. సమావేశం ముగిశాక టీడీపీ నేతలు మాట్లాడారు. తాము ప్రస్తావించిన అంశాలపై గవర్నర్‌ స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై గవర్నర్ దృష్టి పెడుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎస్సీలపై పెరిగిపోతున్న దాడులు, దళితులపై వైస్సార్సీపీ దాడులు చేయడం వంటివి గవర్నర్ కు వివరించామని తెలిపారు. గవర్నరును చాలా సందర్భాల్లో కలిసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. జగన్ వచ్చినప్పుడల్లా గవర్నరుకు ఏం చెబుతున్నారో..? ఏమో..? ప్రజా సమస్యల పరిష్కారంపై గవర్నర్ ఫోకస్ పెడుతున్నట్టు కన్పించడం లేదని వాపోయారు.

ఇక నిన్న కుప్పం లో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైస్సార్సీపీ శ్రేణులు రెచ్చిపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులకు దిగారని , చివరకు పేదల కడుపులు నింపే అన్న క్యాంటీన్‌ను కూడా ధ్వంసం చేసారని వాపోయారు. టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశారు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన టీడీపీ శ్రేణులపై ప్రతాపం చూపించిన పోలీసులు.. వైస్సార్సీపీ కార్యకర్తల విధ్వంసానికి పూర్తిగా సహకరించారని వారు విమర్శించారు.