చమన్‌లాల్‌ సేవలను కొనియాడిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయవాది చమన్‌లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను నివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చమన్‌లాల్‌ సేవలను కొనియాడారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, తదనంతర ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ చమన్‌లాల్ జీ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను మాతృదేశంతో అనుసంధానమయ్యేలా, వారిలో జాతీయతాభావం పెంపొందేలా విశేష కృషిచేశారని కొనియాడారు.

పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని గుర్తుచేశారు. స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/