మినుములు, కందిపప్పుల నిల్వలపై కేంద్రం ఆంక్షలు పొడిగింపు..!

Centre extends time period for stock limits of tur and urad to 31st December

న్యూఢిల్లీః పప్పు ధరలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. మినుములు, కందిపప్పు, పెసరపప్పు నిల్వలపై ఆంక్షలు పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు నిల్వలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు హోల్‌సేల్‌ వ్యాపారులు 200 మిలియన్ టన్నులకు మించి పప్పులను నిల్వ ఉంచకూడదు. రిటైల్‌ వ్యాపారులు 5 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ, పెద్ద చైన్ రిటైలర్స్‌ వద్ద 5 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఉంచకూడదని స్పష్టం చేసింది.

మిల్లర్ల వద్ద సైతం గత మూడునెలల్లో చేసిన ఉత్పత్తి మేరకు గానీ, లేదంటే వార్షిక ఉత్పత్తి సామర్థ్యంలో 25శాతంలో ఏది ఎక్కువైతే అంతకు వరకు మాత్రమే నిల్వలు ఉంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దిగుమతిదారులు కస్టమ్స్‌ క్లియరెన్స్‌ తేదీ నుంచి 60రోజుల కంటే ఎక్కువ దిగుమతి చేసుకున్న స్టాక్‌ను కలిగి ఉండేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అలాగే వినియోగదారుల వ్యవహారాల శాఖ పోర్ట్‌లో ఎప్పటికప్పుడు తమ స్టాక్స్‌ అప్‌డేట్‌ చేయాలని స్పష్టం చేసింది. అయితే, వర్షాకాలం సీజన్‌లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురువకపోవడం, ధరల పెరుగుదల ఆందోళన నేపథ్యంలో కేంద్రం నిల్వలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. మరో వైపు పప్పుల ఉత్పత్తులు సైతం భారీగా పడిపోయాయి.