పునఃప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర

amarnath-yatra-resumes-after-inclement-weather

శ్రీనగర్ః అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయిన అమర్‌నాథ్‌ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. 4,020మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్‌ దర్శనానికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. జమ్ములోని భగవతినగర్‌ యాత్రి నివాస్‌ నుంచి 110 వాహనాలు గట్టి బందోబస్తు మధ్య బేస్‌ క్యాంపులకు బయలుదేరినట్లు సైనికవర్గాలు ప్రకటించాయి. అందులో 1016 మంది భక్తులు తెల్లవారుజామున 3:30 సమయంలో 35 వాహనాల్లో బాల్తాల్‌ బేస్‌ క్యాంపునకు బయలు దేరినట్లు తెలిపారు. మరో 2వేల 425మంది 75వాహనాల్లో పెహల్గావ్‌ బేస్‌ క్యాంపునకు బయలుదేరినట్లు పేర్కొన్నారు. ఈ ఉదయం పెహల్గావ్‌ మార్గంలోని నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికుల బృందం వెళ్లిందని అధికారులు తెలిపారు. యాత్రికులందరూ రేపు అమర్‌నాథ్‌ మంచు లింగాన్ని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

కాగా, గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటికీ పలువురి ఆచూకీ దొరకలేదు. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ తర్వాత ఐటీబీపీ, ఆర్మీ, వైమానిక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గుహ వద్ద మట్టి, రాళ్లను భద్రతా సిబ్బంది తొలగించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/