ఏపిలో దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందిః నారా లోకేశ్

బలవంతంగా డౌన్ లోడ్ చేయించడంపై సందేహాలు

nara-lokesh

అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సందేహం వ్యక్తం చేశారు. పురుషుల మొబైల్స్ లో ఆ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. జగనాసుర పాలనలో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టానికే దిక్కూ మొక్కు లేదు.. మహిళల భద్రత కోసమని తెచ్చిన దిశ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడమేంటని ప్రశ్నించారు.

దిశ యాప్ డౌన్ లోడ్ విషయంలో సైనికుడిపై పోలీసులు దాడి చేసిన ఘటనపై లోకేశ్ స్పందించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు రాష్ట్రానికి వస్తే ఆయన ప్రాణానికే రక్షణ లేకుండా పోయిందని తీవ్రంగా మండిపడ్డారు. యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడమేంటని ప్రశ్నించినందుకు అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై దాడి జరిగిందన్నారు. పోలీసులే గుండాల్లాగా సయ్యద్ పై దాడి చేశారని లోకేశ్ విమర్శించారు.