సీబీఐ,ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు: కేంద్రం

పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌లు
ప్రతిసారీ ఏడాదిచొప్పున పెంచేందుకు వీలు

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టర్ల పదవీకాలం ఐదేండ్లు పొడిగించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌లను జారీచేసింది. ఈ సంస్థల డైరెక్టర్ల గరిష్ఠ పదవీకాలం ప్రస్తుతం రెండేండ్లే. అది ముగిసిన తర్వాత అవసరమైతే ప్రతిసారీ ఒక ఏడాది చొప్పున మూడుసార్లు పదవీకాలాన్ని పొడిగించేలా చట్టసవరణ ప్రతిపాదించారు. మొత్తం పదవీకాలం మాత్రం ఐదేండ్లకు మించరాదని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం-1946లోని సెక్షన్‌ 4బీకి సవరణ ప్రతిపాదిస్తూ ఆదివారం ఆర్డినెన్స్‌ జారీచేశారు. ఈడీ డైరెక్టర్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు వీలుగా సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ చట్టం-2003లోని క్లాజ్‌ డీకి సవరణలు ప్రతిపాదిస్తూ మరో ఆర్డినెన్స్‌ ఇచ్చారు. అయితే ప్రస్తుత ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌మిశ్రా, సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌జైస్వాల్‌ పదవీకాలం పొడిగిస్తారా లేదా అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. సంజయ్‌మిశ్రా పదవీకాలం ఈ నెల 19తో ముగుస్తున్నది.

ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌ను ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఎంపికచేస్తున్నది. ఇందులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు. అయితే, రెండేండ్ల తర్వాత సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలాన్ని పొడిగించటానికి కూడా ఈ కమిటీ అనుమతి తప్పనిసరి అని సీబీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌మిశ్రా పదవీకాలం పొడిగింపును సుప్రీంకోర్టు ఇటీవల వ్యతిరేకించింది. ప్రత్యేక పరిస్థితుల్లోనే పొడిగింపు నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా తాజా ఆర్డినెన్స్‌తో మిశ్రా మరికొంత కాలం పదవిలో కొనసాగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/