వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్‌కు బదులు టీజీ మార్పుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్

Centre Approves Transition From TS To TG For Vehicle Number Plates In Telangana

హైదరాబాద్‌ః తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద.. టీఎస్ స్థానంలో టీజీని ప్రవేశపెడుతూ కేంద్ర రహదారి రవాణాశాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1989 జూన్ 12న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన గెటిట్‌లో ఈ మేరకు మార్పులు చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్కును మార్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై చేసిన తీర్మానాన్ని రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దీంతో, కేంద్రం తగు మార్పులు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా ఇకపై రాష్ట్రంలో కొత్త వాహనాలను టీజీ మార్కుతో రిజిస్టర్ చేయనున్నారు.