సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం – కేంద్రం నిర్ణయం

నిజాం రాజుపై సైనిక చర్య చేపట్టి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన రోజైన సెప్టెంబర్‌ 17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే (Hyderabad Liberation Day)’ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

1947లో ఆగస్టు 15న దేశానికంతటికీ స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం 13 నెలల పాటు నిజామ్ పాలన ఉందని పేర్కొంది. పోలీస్ చర్య తరువాత సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించిందని పేర్కొంది. హైదరాబాద్ విమోచన దినం జరపాలన్న డిమాండ్ ప్రజల్లో ఎప్పటి నుంచో ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అమరుల జ్ఞాపకార్థం, యువతలో దేశభక్తి పెంపొందించేందుకు హైదరాబాద్ విమోచన దినం జరుపుకునేందుకు నిర్ణయించినట్టు గెజిట్‌లో హోం శాఖ పేర్కొంది.