ఏపీకి ప్రత్యేక హోదా అనేది మర్చిపోవాల్సిందే ..తేల్చేసిన కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదా అనేది మర్చిపోవాల్సిందేనని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో మంగళవారం (జులై 19) టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ‘ఏపీ స్పెషల్ స్టేటస్’ అంశంపై ప్రశ్నఅడిగారు. దీనికి కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదని.. విభజన చట్టం ప్రకారం ఏపీకి చేయాల్సిదంతా చేస్తున్నామని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు, ఇవ్వని రాష్ట్రాలకు అభివృద్ధి విషయంలో తేడా ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

ప్రత్యేక హోదాకు 14వ ఆర్థికసంఘం ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచిందని వెల్లడించారు. అలాగే రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించిందని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం కూడా ఆ సిఫారసులను కొనసాగించిందని వివరించారు. విభజన చట్టం ప్రకారం ఇచ్చిన ఇతర హామీలను చాలావరకు నెరవేర్చామన్న నిత్యానందరాయ్.. కొన్ని మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపిందని బట్టి చూస్తే ఇక ఏపీకి ప్రత్యేక హోదా అనేది మరచిపోవాల్సిందే.