తెలంగాణ‌లో ధాన్యం సేక‌ర‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

తెలంగాణ‌లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌పై నెల‌కొన్న ప్ర‌తిష్ఠంభ‌న తొల‌గించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో ధాన్యం సేక‌ర‌ణ‌కు భార‌త ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు బుధ‌వారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయ‌ల్‌, కిష‌న్ రెడ్డిలో ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై వివరణ ఇచ్చారు. ప్రధానమంత్రి అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరించడాన్ని నిలిపివేశామని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వమే సృష్టించిందని విమర్శించింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం మండిపడింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని పేర్కొంది.

40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమవడాన్ని గుర్తించామని తెలిపిన కేంద్రం.. డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని వెల్లడించింది. అయితే మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశం వెలుగులోకి వచ్చిందని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని పేర్కొంది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని తెలిపింది.

ఇక తెలంగాణ‌లో పండిన ధాన్యం సేక‌ర‌ణ‌లో జాప్యం కార‌ణంగా రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌న్న కేంద్ర మంత్రులు… నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేక‌రించేందుకు ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యంతో పాటు బియ్యాన్ని కూడా సేక‌రించేందుకు త్వ‌ర‌లోనే ఎఫ్‌సీఐ రంగంలోకి దిగుతుంద‌ని వారు ప్ర‌క‌టించారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో తెలంగాణ స‌ర్కారు రాజ‌కీయం చేస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రులు ఆరోపించారు.