ముగిసిన రావత్ దంపతుల అంత్య‌క్రియ‌లు

న్యూఢిల్లీ: సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్‌కు ఆశ్రు నాయ‌నాల మ‌ధ్య ఇవాళ అంతిమ వీడ్కోలు ప‌లికారు. భార‌త ఆర్మీని ప్రొఫెష‌న్ ఆర్మీగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నించిన రావ‌త్‌కు విష‌న్న‌వ‌ద‌నాల‌తో గుడ్‌బై ప‌లికారు. ర‌ణ‌నీతిలో త‌న అన‌న్య‌సామాన్య కౌశ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన బిపిన్ ఎప్ప‌టికీ గుర్తుండిపోతారు. కేవ‌లం సైన్యాధికారి రూపంలో మాత్ర‌మే కాదు.. వ్య‌క్తి రూపంలో ఆయ‌న అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. దేశ‌భ‌క్తి, ప‌రాక్ర‌మం, వీర‌త్వం, సాహ‌స గుణాల‌తో అంద‌ర్నీ మెప్పించారు. అజేయ యోధుడిగా అమ‌రుడ‌య్యారు. దేశానికి ప్రేర‌కుడిగా నిలిచిన జ‌న‌ర‌ల్ రావ‌త్‌కు ఇవాళ ఢిల్లీలోని బార‌ర్ స్క్వేర్‌లో ఘ‌నంగా సైనిక రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు.

రావ‌త్ దంప‌తుల ద‌హ‌న సంస్కారాల‌కు భారీ సంఖ్య‌లో విదేశీ అతిథులు హాజ‌ర‌య్యారు. హిందూ వైదిక ధ‌ర్మం ప్ర‌కారం అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. రావ‌త్ ఇద్ద‌రు కుమార్తెలు కృతిక‌, త‌ర‌ణిలు ఆ పూజ‌ల్లో పాల్గొన్నారు. బిపిన్‌ రావ‌త్, మ‌ధులికా రావ‌త్‌ దంప‌తుల పార్డీవ‌దేహాల‌ను ఒకే చితిపై పెట్టారు. సాంప్ర‌దాయం ప్ర‌కారం రావ‌త్ కుమార్తెలు ద‌హ‌న ధ‌ర్మాలు చేప్ట‌టారు. ఇద్ద‌రు కుమార్తెలు రావ‌త్ దంప‌తుల చితికి నిప్పు అంటించారు. బుధ‌వారం జ‌రిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్ దంప‌తులు మృతి చెందిన విష‌యం తెలిసిందే.

సైనిక లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారాలు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో 17 గ‌న్ సెల్యూట్ చేశారు. అంత‌క‌ముందు ఆయ‌న ఆత్మ‌కుశాంతి చేకూర్చాల‌ని విదేశీ అంబాసిడ‌ర్లు, ఆర్మీ నాయ‌కులు ప్రార్థించారు. పుష్ప గుచ్ఛాలు అర్పించారు. శ్రీలంక‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌లు హాజ‌ర‌య్యారు. 800 మంది త్రివిధ ద‌ళాల సైనికులు అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/