జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు.. సీబీఎస్​ఈ

మూడేళ్ల ప్రతిభ ఆధారంగా మార్కులు

న్యూఢిల్లీ: 12వ తరగతి ఫలితాలను జులై 31లోగా వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పదో తరగతి, పదకొండో తరగతి, ప్రి బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తామని చెప్పింది. కరోనా సంక్షోభంతో ప్లస్ 2 పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పదో తరగతి నుంచి గత మూడేళ్లలో బోర్డు పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా మార్కులను కేటాయిస్తామని పేర్కొంది.

విద్యార్థుల ప్రతిభ మెరుగుపడేలా పాఠశాలలు మార్కులిచ్చేందుకుగానూ మోడరేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ తెలిపారు. ప్రతి స్కూల్ లో ఈ కమిటీకి సంబంధించి ఆయా స్కూల్ కు చెందిన ఇద్దరు సీనియర్ టీచర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే మూడో వ్యక్తినీ నియమిస్తామన్నారు.

కాగా, ప్లస్ 2 ప్రి బోర్డ్ ఎగ్జామ్స్ ను బట్టి 40 శాతం మార్కులు, పదకొండో తరగతి వార్షిక పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా 30 శాతం మార్కులు, పదో తరగతి ప్రతిభ ఆధారంగా మరో 30 శాతం మార్కులను ఇస్తామని జస్టిస్ ఎ.ఎం. ఖన్వీల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనానికి సీబీఎస్ఈ ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల కమిటీ తెలిపింది. స్కూళ్లు అందించిన వివరాలను బట్టి ప్రాక్టికల్ మార్కులను వేస్తామంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/