వివేకా మృతదేహాన్ని తొలుత చూసింది వారే : టైపిస్ట్ షేక్ ఇనయతుల్లా

తొలుత చూసింది అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని చెప్పిన వివేకా టైపిస్ట్ షేక్ ఇనయతుల్లా

అమరావతి: మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హత్య కేసులో నిందితులు, అనుమానితులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు రోజుకోటి వెలుగుచూస్తున్నాయి. ప్రధాన నిందితుడైన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పటికే బయటకు వచ్చి సంచలనం సృష్టించగా, రెండు రోజుల క్రితం సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. వివేకా హత్య వెలుగుచూసిన తర్వాత ఆయన బాత్రూము, బెడ్రూములోకి తొలుత వెళ్లింది వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని వివేకానందరెడ్డి వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్ ఇనయతుల్లా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబరు 8న ఆయన వాంగ్మూలం ఇవ్వగా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

లోపలికి వెళ్లిన వారిద్దరూ బయటకు వచ్చిన తర్వాతే మిగతావారు లోపలికి వెళ్లారని, బెడ్రూములోని రక్తం, వివేకా మృతదేహం ఫొటోలను తాను తీశానని వివరించారు. తాను ఫొటోలు తీసిన విషయాన్ని గుర్తించిన అవినాష్‌రెడ్డి కజిన్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తనపై కేకలు వేశారన్నారు. ఆ తర్వాత కాసేపటికే వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారని, అయితే అప్పటికే తాను వివేకా మృతదేహానికి సంబంధించిన ఫొటోలు తీశానని ఇనయతుల్లా పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వివేకానందరెడ్డి పీఏ కూడా వివేకాకు ఏదో జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి గదిలో చర్చించుకుంటూ కనిపించారన్నారు. కాసేపటి తర్వాత వివేకా గుండెపోటుతో చనిపోయారని, గాయాలకు బ్యాండేజీ, కాటన్ చుట్టాలని వారు చెప్పారని పేర్కొన్నారు.

ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ”వివేకానందరెడ్డి చనిపోయిన ప్రదేశంలో పేరుకుపోయిన రక్తాన్ని శుభ్రం చేయాలని గంగిరెడ్డి నాతో చెప్పారు. నేను స్పందించకపోవడంతో కేకలు వేశారు. ఆయన అంతలా ఎందుకు కంగారుపడుతున్నారో, రక్తపు మడుగును శుభ్రం చేయాలని ఎందుకు అంతలా అరుస్తున్నారో తెలియక వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని అడిగా. ఆయనేమో తనకూ అర్థం కావడం లేదన్నారు. ఆ తర్వాత వివేకా మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచేందుకు భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ఫ్రీజర్‌ను తెప్పించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సీఐ శంకరయ్య బాత్రూమును పరిశీలించేందుకు వెళ్లారు. వెంట నేనూ వెళ్లాను. అక్కడున్న అల్మారా హ్యాండిల్ విరిగిపోయి ఉండడాన్ని గమనించా. ఆ విషయం సీఐకి చెప్పాను. అంతకుముందు హ్యాండిల్ అక్కడ ఉన్న విషయం చెప్పా. గోడలపై ఉన్న రక్తపు మరకలను కూడా గమనించా. వివేకాను ఎవరో చంపేసి ఉంటారని సీఐతో చెప్పా. ‘‘మీ సార్‌ను చంపాలని ఎవరు అనుకుంటారు. ఆయన కమోడ్‌పై పడిపోయినప్పుడు తలకు గాయాలై రక్తం వచ్చి ఉంటుంది’’ అని ఆయన నాతో చెప్పారు.

ఆ తర్వాత వివేకా మృతదేహాన్ని పరీక్షగా చూస్తే మెడ కొంచెం వంగినట్టు కనిపించింది. దీంతో దానిని తిన్నగా చేయాలని ప్రయత్నిస్తే నా వేళ్లు ఆయన పుర్రెలోకి వెళ్లాయి. అది చూసి నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. పెద్దగా కేకలు వేశా. ఇదే విషయాన్ని ఎన్.శివప్రకాశ్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పా. దీంతో ఆయన స్పందిస్తూ ఎంవీ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తారని చెప్పారు. ఫిర్యాదిస్తేనే పోస్టుమార్టానికి తరలిస్తామని, లేదంటే అవసరం లేదని సీఐ శంకరయ్య అక్కడున్న వారితో చెప్పారు. గంగరెడ్డి నమ్మదగ్గ వ్యక్తి కాదని వివేకానందరెడ్డి గతంలోనే నాతోనే చెప్పారు..” అని ఇనయతుల్లా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆ రోజు జరిగిన విషయాలను పూసగుచ్చినట్టు వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/