హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు

హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదయింది. సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న మాధవి లత.. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్టు ఊహాజనిత సంజ్ఞ చేశారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ఐపీసీలోని 295-ఏ (మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 ( ఉద్దేశపూర్వకంగా మతవిశ్వాసాలను రెచ్చగొట్టడం), హానికరమైన చర్యలకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. నాల్గు రోజుల నుండి దీనికి సంబదించిన వీడియో వైరల్ అవ్వడం తో మాధవి లత స్పందిస్తూ.. వీడియో అసంపూర్తిగా ఉందని.. వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని కూడా తెలిపారు.