భారత్‌, కెనడా ఉద్రిక్తతల వేళ..దీపావళి వేడుకల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో

హ్యాపీ దివాలీ.. హ్యాపీ బండి చోర్ దివస్ అంటూ విషెస్

Canadian PM Justin Trudeau participates in Diwali celebrations at Ottawa amid tensions with India

ఒట్టావాః భారత్‌తో ఉద్రిక్తతలకు కారణమైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒట్టావాలో ఈ నెల 7న భారతీయ సమాజం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. పార్లమెంట్ హిల్‌లో జరిగిన ఈ వేడుకల అనంతరం ప్రధాని తన ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ఈ వారంలో ప్రజలు దీపావళి, బండి చోర్ దివస్ జరుపుకుంటారని, ఇవి రెండు మనకు మరిన్ని వెలుగులు ప్రసాదిస్తాయని, ఈ వేడుకలు మీలో ఆశావాహ దృక్పథాన్ని నింపుతాయని పేర్కొన్నారు. హ్యాపీ దివాలీ.. హ్యాపీ బండి చోర్ దివస్’ అని రాసుకొచ్చారు.

ఇండో-కెనడియన్ పార్లమెంటేరియన్ చంద్రశేఖర్ ఆర్య ఆధ్వర్యంలో పార్లమెంట్‌ హిల్‌లో దీపావళి వేడుకలు జరిగాయి. ఒట్టావా, గ్రేటర్ టొరొంటో, మాంట్రియల్ వంటి నగరాల నుంచి ఈ వేడులకు పెద్ద ఎత్తున భారతీయులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన ఆర్య ఈ ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేస్తూ పార్లమెంటు హిల్‌లో దీపావళి వేడుకలకు నిర్వహించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.