హత్య చేసిన వారు అక్కడ అద్భుతంగా బతుకుతున్నారుఃబంగ్లా విదేశాంగ మంత్రి

హంతకులకు కెనడా అడ్డాగా మారిందంటూ బంగ్లాదేశ్ ఆరోపణ

‘Canada has become a hub for murderers’: Bangladesh

ఢాకా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో పరోక్షంగా భారత్ కు బంగ్లాదేశ్ బాసటగా నిలిచింది. కెనడా నుంచి భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జర్ ను ఈ ఏడాది జూన్ లో గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వారా ముందు కాల్చి చంపడం తెలిసిందే. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనడానికి బలమైన ఆధారాలున్నాయంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బహిరంగ ఆరోపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఘర్షణాత్మకంగా మారాయి.

కెనడా భారత్ వ్యతిరేక శక్తులకు, వేర్పాటు వాదులకు, ఉగ్రవాదులకు, నేరస్థులకు, మానవ అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్ వాదనకు మద్దతుగా శ్రీలంక కూడా నిలిచింది. ఉగ్రవాదులు కెనడాను సురక్షిత గమ్యస్థానంగా చేసుకున్నారని.. అందుకే ప్రధాని జస్టిన్ ట్రూడో ఎలాంటి ఆధారాల్లేకుండా దారుణమైన ఆరోపణలు (భారత్ పై) చేసినట్టు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రే ఇటీవలే ప్రకటన చేయడం గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ సైతం కెనడాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. కెనడా వేర్పాటువాద విధానాలను ప్రశ్నించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబిర్ రెహమాన్ ను తానే హత్య చేసినట్టు ప్రకటించుకున్న నూర్ చౌదరిని అప్పగించేందుకు కెనడా నిరాకరించడమే దీనికి నేపథ్యంగా ఉంది.

‘‘హంతకులకు కెనడా కేంద్రంగా మారకూడదు. హత్య చేసిన వారు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. హత్య చేసినప్పటికీ వారు అక్కడ అందమైన జీవితం గడుపుతున్నారు. వారి బంధువులు మాత్రం సమస్యలను ఎదుర్కొంటున్నారు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఆరోపించారు.