ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్‌ నుంచి పిలుపు

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కు BRS అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కొద్ది రోజులగా సొంత పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై రాజయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఎమ్మెల్యే రాజయ్య కు BRS అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ప్రగతి భవన్ కు రావాల్సిందిగా.. కేటీఆర్ సూచించారు. మరికాసేపట్లో రాజయ్యతో కేటీఆర్ మాట్లాడనున్నారు.

మొదటి నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం మరింత పెరుగుతుంది. రీసెంట్ గా జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం హిమ్మత్ నగర్‌లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ ఆరుద్ర పురుగుల్లా కడియం ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో నువ్వు(కడియం) ఎమ్మెల్యే కాకముందు నీ ఇంటి కిటికీలకు గోనె సంచులు ఉండే. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయి. నీతిమంతుడని మాట్లాడుతున్నావు. నేతి బీరకాయలో నేతి ఎంతుంటుందో నువ్వు అంతే. కడియం శ్రీహరి ఒక అవినీతి తిమింగలం అంటూ ధ్వజమెత్తారు రాజయ్య.

మంత్రి పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఏం పనిచేశావో అన్ని నాకు తెలుసు. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. అవసరం వచ్చినప్పుడు పుస్తకం బయటపెట్టి.. నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో.. అన్నీ బయటపెడతా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాన్ని కుదవపెట్టి సింగపూర్‌, మలేషియాలో ఆస్తులు సంపాదించావు అని కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. శ్రీహరి SC కాదు..ఆయన తల్లి బీసీ.. విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లను శ్రీహరి దుర్వినియోగం చేశారు.. అంటూ పేర్కొన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో శ్రీహరి ఎమ్మెల్యే అయ్యారన్నారు. ఏ విషయంలోనైనా నువ్వు గొప్పో, నేను గొప్పో తేల్చుకుందాంరా అంటూ సవాల్ చేశారు. సమయం నువ్వే చెప్పాలంటూ శ్రీహరికి రాజయ్య సవాల్‌ చేశారు. ఓడిపోయాక శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌ను పట్టించుకోలేదు.. శ్రీహరికి అందుకే దళిత దొర అని బిరుదు అంటూ రాజయ్య పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కడియం సైతం ఘాటుగానే స్పందించారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం వ్యక్తగతం వరకు వెళ్తుండడంతో అధిష్టానం పిలుపు నిచ్చింది. మరి ఈరోజు రాజయ్య ను పిలిచిన అధిష్టానం..రేపు శ్రీహరిని సైతం పిలుస్తుందేమో చూడాలి.