కాళ్లు విరగ్గొడతానని బాలినేని సొంత పార్టీ నేతలకు వార్నింగ్..

వైస్సార్సీపీ లో మరోసారి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత రెండు రోజులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు మీడియా లో హాట్ టాపిక్ అవుతుంది. సొంతనేతలే తనను టార్గెట్ చేసారని ఆరోపిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని, తనపై కుట్రలు చేస్తున్నవారి పేర్లను త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తానని, అవసరమైనే ముఖ్యమంత్రి జగన్కు సైతం ఫిర్యాదు చేస్తానన్నారు. ఇటీవల తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని టీడీపీ నేతలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారికి కొంతమంది వైస్సార్సీపీ నేతలు సహకరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. సొంత పార్టీ లోనే కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించిన బాలినేని..తాజాగా వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

తాను తింటున్నది కూడా ఉప్పు, కారమేనని, ఇకపై వారు పద్ధతి మార్చుకోకుంటే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. నిన్న జరిగిన ఒంగోలు పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్, మునిసిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనుతో చేతులు కలిపి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేతులు కలిపిన వారు ఎవరో తనకు తెలుసని, వారు ఎంత పెద్ద వారైనా వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఓపిక పట్టానని, ఇక తన వల్ల కాదని స్పష్టం చేశారు.