సీపీఎం నేత రాఘవులు కీలక నిర్ణయం..పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా

సీపీఎం నేత రాఘవులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసారు. సీపీఎం అనుబంధ విద్యార్ధి సంఘం ఎస్‌ఎఫ్ఐ లో పని చేస్తూ క్రమేణా పార్టీలో ఎదిగిన రాఘవులు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేసారు. సీపీఎం సంస్థాగత ర్మాణంలో రాఘవులు కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలోనూ రాఘవులకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాఘవులు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు రాఘువులు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా వెనక్కి తీసుకోవాలని అగ్రనేతలు రాఘవులును బుజ్జగిస్తున్నారు. అయినా వెనక్కు తగ్గని రాఘువులు సాధారణ కార్యకర్తగా క్షేత్రస్థాయిలో పనిచేస్తానని వారికి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులతోనే రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఇప్పటివరకూ ఆమోదించలేదు. ఏపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఆయన రాజీనామాకు కారణమని పార్టీ వర్గాలంటున్నాయి. ఏపీలో పార్టీ యాక్టీవ్‌గా లేదని.. ఇప్పుడు పార్టీ నాయకత్వంలోనూ వర్గ పోరు నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ విషయంలోనే వచ్చిన విబేధాలు రాఘవుల రాజీనామాకు కారణమంటున్నారు.