ఆరోగ్య రంగానికి అగ్రపీఠం

కేంద్ర బడ్జెట్ -2021

budget- Priority to the health sector
budget- Priority to the health sector

కేంద్ర బడ్జెట్‌ వస్తుందంటే పన్ను చెల్లింపుదార్లతోపాటు, సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే అంశాలు ఎన్నో ఉంటాయని ఆ వర్గాలు ఎంతో ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశ మిగిల్చింది. కరోనా సంక్షో భంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌సోమవారం పార్ల మెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాన్య,మధ్యతరగతి వర్గాలకు ఒనగూరే ప్రయోజనాలేవీ దుర్భిణీ వేసినా కని పించలేదు. తెలుగు రాష్ట్రాలకు సైతం మొండిచెయ్యి చూపించారనే చెప్పుకోవచ్చు. కరోనా నేర్పిన గుణపాఠంతో ఏకంగా ఆరోగ్యరంగానికి గతంలో ఎన్నడూలేని విధంగా 137శాతం కేటాయింపులు పెంచారు. మొత్తం 2,23,486 కోట్లరూపాయలు కేటాయించిన కేంద్రం కేవ లం టీకా కార్యాచరణ కోసమే 35 వేల కోట్లు కేటాయించింది.

ఇక వ్యవసాయరంగానికి సంబంధించి రైతుల నిర సనలను శాంతింపచేసేందుకు కొంతమేర ఊరటనిచ్చే యత్నం చేసిందని భావించవచ్చు. పంటరుణాలు ఎక్కు వగా ఇవ్వాలని నిర్ణయించింది. 16.5 లక్షల కోట్ల వ్యవ సాయరుణాలు జారీచేసేందుకు కేటాయింపులు చేసిన కేంద్రం పంటకు మద్దతు ధరలు కూడా ప్రకటించింది. ఇపుడున్న ధరలపై 1.5 శాతం ఎక్కువ ధరలు వచ్చేటట్లు చర్యలు చేపడతామని గతంలో వచ్చిన ధరలు ఇప్పటి ధరలతో బేరీజువేసి రైతు ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేసారు. కనీస మద్దతు ధరల కారణంగా మొత్తం 43.36 లక్షల మంది రైతులకు మేలు చేకూరుతుందని ప్రకటించిన ఆర్థికమంత్రి ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌యోజననిధి పెంపుజోలికి వెళ్లలేదు.

ఈ సాయం పది వేలరూపాయలకు పెంచాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. అదేవిధంగా సహజంగా బడ్జెట్‌ అంటేనే ముందు ఆశించేది వేతనజీవులు, వ్యక్తిగత పన్నులు చెల్లింపుదార్లు, కార్పొరేట్‌ పన్నులు చెల్లించే సంస్థలు. 2.5 లక్షల వద్దనే వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని యధాతథంగా ఉంచారు. 75 ఏళ్లుపైబడిన వారికిమాత్రమే పన్నుల్లో ఊరటనిచ్చారు. పన్నుశ్లాబుల జోలికి వెళ్లలేదు. కొత్తగా ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌యోజన, మిషన్‌పోషన్‌.3.0 ప్రవేశపెట్టిన కేంద్రం ఆర్థికవ్యవస్థ పునరుత్తేజం కోసం కీలక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా ఆరుసూత్రాల కార్యాచరణతో బడ్జెట్‌కు రూపకల్పన జరిగిందని చెప్పాలి.

ముఖ్యంగా ఇన్వెస్టర్లు, కార్పొరేట్‌ సంస్థలు, విదేశీపెట్టుబడులను పరిగణనలోనికి తీసుకు న్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ ఖజానా లోటును భర్తీచేయాలని నిర్ణయించారు. 9.5శాతం ఉన్న ఆర్థికలోటును వచ్చే ఏడాదికల్లా 6.8 శాతానికి తెస్తామన్న ధీమా విత్తమంత్రిలో కనిపించింది. ప్రభుత్వ వ్యయం పెంచడంద్వారా మౌలికవనరులరంగంలో మరిన్ని పెట్టుబడులు రాబట్టే లక్ష్యం బడ్జెట్‌ కేటాయింపుల్లో కనిపించింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 1.75 లక్షలకోట్లు రాబట్టేందుకు నిర్ణయించారు. ప్రత్యేకించి నష్టదాయకంగా ఉన్న రెండు బ్యాంకులను ప్రైవేటీకరించ డంతోపాటు బ్యాంకింగ్‌ రంగంలో పెరిగిపోతున్న నిరర్థక ఆస్తుల కట్టడికి బ్యాడ్‌ బ్యాంక్‌ ప్రతిపాదనను కూడా తెచ్చారు. ప్రభుత్వ ఆర్థిక వనరుల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందని తెలుస్తోంది.

సెక్యూరిటీలు, బాండ్లజారీద్వారా నిధుల సమీకరణతోపాటు 12 లక్షలకోట్ల రుణాలు తెస్తామని, రెండునెలల్లోనే 80వేల కోట్లు తెస్తామని ఆమె చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉంది. కీలక రంగాలపై శ్రద్ధ చూపించినా కేటాయింపులపరంగా సామాన్య మధ్యతరగతికి ఒరగబెట్టిందేమీలేదు. పైగా ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలు మెట్రోరైలు ప్రాజెక్టుల రూపంలోను, ఓడరేవుల అభివృద్ధిపరంగాను భారీ ఎత్తున కేటాయింపులు జరి పింది. ఎన్నికల్లో లబ్దికోసమే ఈ కేటాయింపులు చేసారన్న భావనరాకుండా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పి జాగ్రత్తలు తీసుకున్నారు.

పరోక్షరంగ పన్నుల్లో రాబడులు పెరుగుతున్నాయని, జిఎస్‌టి వసూళ్లు 1.2 లక్షల కోట్లకు దాటిందని, ఇదే తరహాలో సుంకాలు, సెస్‌ల రూపంలో కూడా మరిన్ని రాబడులు ఉంటాయని చెప్పారు. అంటే పరోక్షంగా ప్రజలపై సుంకాల భారం మోపినట్లే. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే టూవీలర్‌ ప్రయాణాలకు ఇక చెక్‌పెట్టే పరిస్థితి ఏర్పడింది. పెట్రోలుపై రూ.2.50, డీజిల్‌పై రూ.4 సెస్‌ విధిస్తున్నట్లు ప్రకటించడంతో పెట్రో, డీజిల్‌ ధరలు భారీ ఎత్తున పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల అంతంతమాత్రం ఆదాయ వనరులున్న సామాన్యుడి జేబుకు మరింత చిల్లు పడుతుంది. ధరలు పెరిగే ప్రమాదం ఉండటంతో ఇంధనవనరులపై అగ్రి, ఇన్‌ఫ్రా సెస్‌రూపంలో కేంద్రం వడ్డిస్తోంది.

అయితే సుంకాలను తగ్గించామని ధరలు పెరగవని ఆర్థికమంత్రి సమర్థించుకున్నారు. ఇక మద్యం ఉత్పత్తులపై 100 శాతం,ముడి ఆయిల్‌పై 17.5 శాతం, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు ముడినూనెలపై 20 శాతం, యాపిల్‌పై 35, బంగారం వెండిపై 2.5 శాతం, బఠానిలపై 40 శాతం, కాబూలీ శనగలపై 30 శాతం, శనగలపై 50 శాతం, పత్తిపై ఐదుశాతం అగ్రిఇన్‌ఫ్రాసెస్‌ విధిస్తున్నారు. బడ్జెట్‌ స్టాక్‌మార్కెట్లకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చింది. ఆరోగ్య రంగానికి కేటాయింపులు రెట్టింపు కావడంతో ఒక్కసారిగా హెల్త్‌కేర్‌ రంగం షేర్లు రివ్వున ఎగిసాయి.

సెన్సెక్స్‌ ఒకేసారి 2315 పాయింట్లు లాభపడింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు 6.78 లక్షలకోట్లు లాభాలు చవిచూసారు. బిఎస్‌ఇలో టర్నోవర్‌ కూడా భారీగాపెరిగింది. 192.9 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తంగా చూస్తే ఆర్థికవృద్ధికి ఊతం ఇచ్చిన కొత్త బడ్జెట్‌ పెట్టుబడుల రాకపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించిందని చెప్పాలి. బడుగుజీవుల సంక్షేమానికి అరకొర నిధులే దక్కినట్లు చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/