లోక్ సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేదు..ఒంటరిగానే పోటీః మాయావతి

BSP chief Mayawati

లక్నోః రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని… ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తమ పార్టీ పొత్తుతో వెళుతుందని కొందరు అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా వట్టి పుకారు మాత్రమే అన్నారు. బీఎస్పీ పూర్తి సన్నద్ధతతో… సొంత బలంతో యూపీ లోక్ సభ ఎన్నికల్లో పోరాడుతోందన్నారు. ఇలాంటి సమయంలో కూటమి లేదా థర్ట్ ఫ్రంట్ వంటి ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.

మీడియా కూడా అవాస్తవాలతో కూడిన వార్తలను ప్రచారం చేసి విశ్వసనీయతను కోల్పోకూడదని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ చాలా బలంగా ఉందని… తాము ఒంటరిగా పోటీ చేయడం చేస్తుంటే ఇతర పార్టీలు ఆందోళన చెందుతున్నాయని… అందుకే తమ పార్టీపై పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించుకుందన్నారు.