భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులో సొరంగం

సొరంగాన్ని గుర్తించిన బీఎస్‌ఎఫ్

BSF Detects Tunnel Along India-Pakistan Border in Jammu

న్యూఢిల్లీ: జమ్మూలోని భారత్-‌పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులో ఓ సొరంగా మార్గాన్ని సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) గుర్తించాయి. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు ఉపయోగపడేలా భారీ సొరంగాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ గుర్తించింది. సరిహద్దు వెంబడి ఇతర రహస్య నిర్మాణాల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. భారత్ వైపు సరిహద్దు కంచె నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న ఈ సొరంగాన్ని.. జమ్ములోని సాంబా సెక్టార్‌లో గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ గుర్తించింది. సొరంగంను పరిశీలించగా 15, 20 ‘పాకిస్తాన్ గుర్తులు’ ఉన్న ప్లాస్టిక్ ఇసుక సంచులను కనుగొన్నట్లు బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్తానా తెలిపారు.

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల భూమి మునిగిపోతున్నట్లు గమనించిన బీఎస్ఎఫ్ జవాన్ల అనుమానం వచ్చిందని, దాంతో భూమిని కదిలించే యంత్రంతో వెళ్లి చూడగా నిర్మాణంలో ఉన్న 20 మీటర్ల పొడవు సొరంగం బయటపడిందని చెప్పారు. ఈ సొరంగం ప్రారంభంలో 25 అడుగుల లోతును కలిగి ఉన్నదని, బీఎస్ఎఫ్ ‘తిమింగలం’ సరిహద్దు పోస్ట్ సమీపంలోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇతర రహస్య నిర్మాణాలను గుర్తించడానికి ఈ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మెగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ పర్యవేక్షణ కోసం బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (జమ్ము) ఎన్ఎస్ జమ్వాల్ కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/