సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో అపచారం
సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయంలో స్వామి నిజ రూపదర్శనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి షేర్ చేయడం కలకలం రేపుతుంది. ఈ నెల 23 న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం కార్యక్రమ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు.
స్వామివారి అంతరాలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం ఉన్నా ఇలా బయటకు రావడంతో కలకలం రేగుతోంది. ఎంతో పవిత్రంగా కొలిచే స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు ఏడాది పాటు వేచి చూస్తూ అక్షయ తృతీయ నాడు ఒక్క రోజు మాత్రమే లభించే స్వామి నిజరూపదర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి నియమ, నిష్ఠాలుంటూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం బయటకు రావడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గత ఏడాది కూడా ఇలాంటి అపచారమే జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి కొందరు స్వామివారి గర్భాలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.