మరికాసేపట్లో ఖాందర్ లోహలో బీఆర్ఎస్ బహిరంగ సభ

దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కీలక సభ్యులను నియమించిన అధినేత..భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ తమ ఉనికిని చాటుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు మహారాష్ట్రలోని కాందార్‌ లోహలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఇదే జిల్లాలో సభ నిర్వహించిన కేసీఆర్..ఇప్పుడు మరోసారి అదే జిల్లాలో మరో సభ నిర్వహిస్తున్నారు. లోహా పట్టణంలోని బైల్‌ బజార్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభాప్రాంగణం ముస్తాబైంది. స్టేజీతోపాటు దాదాపు 50 వేల నుంచి 70 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, డేరాలతోపాటు వేసవి నేపథ్యంలో సభికుల కోసం కూలర్లను సైతం అమర్చారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్‌, లోహా పట్టణాలు గులాబీమయమయ్యాయి. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో సుందరంగా తీర్చిదిద్దారు.

ఈరోజు మధ్యాహ్నం ఈ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా బీజేపీ, మోడీ ఫై కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. మోడీ టార్గెట్‌గా రాజకీయాలు నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, విధానాలను తూర్పారపడుతున్నారు. అలాగే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా దానిని అభివర్ణించారు. దీంతో ఈ విషయంపై కూడా కేసీఆర్ మరోసారి స్పందించే అవకాశముంది. అలాగే మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ, ఇతర అంశాల గురించే మాట్లాడనున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.