ఖమ్మం జిల్లాలో రైతులకు న్యాయం జరగడం లేదు: ఈటల రాజేందర్

జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ ఫ్యూడలిస్టుగా వ్యవహరిస్తున్నారని మండిపాటు

brs-started-money-politics-says-etela-rajender

వచ్చే ఎన్నికల కోసం బిఆర్ఎస్ పార్టీ డబ్బు సంచులతో రాజకీయం మొదలు పెట్టిందని బిజెపి నేత ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. నాలుగు నెలల క్రితమే ఈ తతంగానికి తెరలేపిందని, దీని కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కెసిఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగి పోయారని, ఇకపై కెసిఆర్ పాలన వద్దనుకుంటున్నారని అన్నారు. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న ఖమ్మం జిల్లాలో రైతులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, వారికి మోసపూరిత మాటలు చెపుతూ మోసం చేస్తోందని మండిపడ్డారు. 

ఎండు మిర్చికి సరైన ధర లేదని ఈటల చెప్పారు. కష్టపడి పండించిన వరికి సరైన ధర లేకపోవడంతో… వరి కుప్పల దగ్గరే రైతులు పడుకుంటున్నారని అన్నారు. ధాన్యం అమ్మాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, ఇది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమని చెప్పారు. రైతులకు సబ్సిడీ పనిముట్లను కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. తమది కమ్యూనిస్టు కుటుంబమని చెప్పుకుంటున్న జిల్లాకు చెందిన మంత్రి (పువ్వాడ అజయ్) పచ్చి ఫ్యూడలిస్టులా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని, ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు.