దూసుకెళ్తున్న కారు… రాబోయేది మ‌ళ్లీ కెసిఆర్ స‌ర్కారు… హ్యాట్రిక్ సిఎం కెసిఆర్ః కవిత

గణేష్ గుప్తా రెండో సెట్ నామినేషన్ ప్రక్రియకు వెంట కారులో వెళ్లిన కవిత

brs-mlc-kavitha-drives-brs-leader-car

నిజామాబాద్ ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారు డ్రైవర్‌గా మారారు. తమ పార్టీ అభ్యర్థితో నామినేషన్ వేయించేందుకు వెళ్లిన ఆమె కాసేపు కారు నడిపారు. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు కవితతో కలిసి అంబాసిడర్ కారులో బయలుదేరారు. ఈ కారును స్వయంగా కవిత నడిపారు. తాను కారు డ్రైవింగ్ చేస్తున్న వీడియోను, ఫోటోలను కవిత సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘దూసుకెళ్తున్న కారు… రాబోయేది మ‌ళ్లీ కెసిఆర్ స‌ర్కారు… హ్యాట్రిక్ సిఎం కెసిఆర్’ అని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి, బిఆర్ఎస్ పథకాలు చూసిన ప్రజలు మరోసారి ఆయనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వరుసగా మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యి రికార్డ్ సృష్టిస్తారన్నారు. ప్రజల ఆదరణ ప్రేమ వల్ల గెలుపు ఖాయమన్నారు.

నిజామాబాద్ పట్టణం ఆనాడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అనే ఆలోచన చేయాలన్నారు. ఇక్కడ కల్పించిన శాంతిభద్రత వాతావరణం కారణంగా అంతర్జాతీయ కంపెనీలు నిజామాబాద్‌కు వచ్చాయన్నారు. 54 సంవత్సరాలు అవకాశమిచ్చిన కాంగ్రెస్ ఎప్పుడు కూడా నిజామాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. ఆరుసార్లు బిజెపికి అవకాశమిస్తే కూడా చేసిందేమీ లేదన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు.