తిరుమలకు పోటెత్తిన భక్తులు..శ్రీవారి దర్శనానికి 20 గంటలు

సమ్మర్ కావడం..సెలవులు కావడం తో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. బుధవారం 74,995 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. గురువారం (నేడు) స్వామి దర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి భక్తులు బుధవారం సమర్పించుకున్న మొక్కులతో హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది. ఇటీవల ఆలయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తిరుమలలో సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రెండు రోజుల పాటు శ్రీవారి ఆలయం, క్యూలైన్లను సెక్యూరిటీ కమిటీ పరిశీలించింది.

టీటీడీ అధికారులతో కలిసి శ్రీవారి ఆలయం, మాడవీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రింగ్ రోడ్లు, వాటర్ పంపింగ్ హౌస్, నారాయణగిరి ఉద్యానవనం, క్యూలైన్లు, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాంతాలను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్యూరిటీ కమిటీ ముఖ్య అధికారి హరీశ్ కుమార్ గుప్త పరిశీలించారు.