BRS మేనిఫెస్టో విడుదల..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బిఆర్ఎస్ 2023 మేనిఫెస్టో ను విడుదల చేసారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పటు చేసిన కేసీఆర్..ముందుగా బిఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. కాకపోతే మొత్తం అభ్యర్థులకు బీ ఫారాలు సిద్ధం కాకపోవడం తో 51 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం 2023 మేనిఫెస్టో ను విడుదల చేసారు.

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన మేనిఫెస్టో చూస్తే..

కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా : తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమా. దీనిద్వారా దాదాపు 93 లక్షల కుటుంబాలకు లబ్ది.

ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.5వేలకు పెంపు. ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి (₹2016) తొలి ఏడాది రూ.1000, ఆ తర్వాత ఏటా రూ.500ల చొప్పున మొత్తంగా ఐదేళ్లలో రూ.5 వేలకు పెంచుతాం.

దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంపు. దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలకు పెంపు. ఏటా రూ.300ల చొప్పున పెంచుతాం.

సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తాం.
అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా.

రైతు బంధు సాయం మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతాం. తొలి ఏడాది సాయాన్ని రూ.12వేల వరకు పెంపు.

పవర్‌ పాలసీ, అగ్రికల్చర్‌ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తాం. ఇంకా అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో వాటిని కూడా చేసుకుంటూ ముందుకు సాగుతాం.

ప్రజల ఆశీర్వాదంతో భారాస ప్రభుత్వమే ఎన్నికవుందని బలంగా విశ్వసిస్తున్నాం. మేం ఇచ్చే ఈ హామీలను మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆరు, ఏడు నెలల్లో అమలు చేస్తాం.

‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తాం.

దళిత బంధు, రైతు బీమా కొనసాగింపు.

గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు. భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తాం.

లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలను చేస్తాం.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో లక్ష రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తాం.

అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల.

మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు.

రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీ.

ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్‌ కోసం కమిటీ ఏర్పాటు.