ఈనెల 13 నుంచి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారం

CM KCR Public Meeting In Warangal

లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. ఈనెల 13న చేవెళ్ల సభ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారట. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా బస్సు యాత్ర ఉండనుందట. మరోవైపు వరంగల్ ఎంపీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పదేళ్ల తమ హయాంలో చేసిన పనులను వివరిస్తూ గులాబీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లనుంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ కు లోక్‌సభ ఎన్నికలు అత్యంత సవాల్​గా మారాయి.

అసెంబ్లీ ఓటమి నుంచి తేరుకోకముందే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల వలసలు ఇక్కట్లను తెచ్చిపెట్టాయి. ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేసి ఆ తదుపరి శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మెజార్టీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత మండల స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.