భారీ వర్షానికి నారాయణగిరి అతిథి గృహాలు ధ్వంసం

తిరుపతిలో నగరం లో ఎన్నడూ లేని విధంగా వర్షం బీబత్సం కొనసాగుతుంది. ఈ భారీ వర్షాలకు నారాయణగిరి అతిథి గృహాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మూడు గదులు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో గదులలో భక్తులు ఎవరు లేకుండా పెను ప్రమాదం తప్పింది. నారాయణగిరి, ఎస్వీ గెస్ట్‌స్‌లో ఉన్న భక్తులను ఇతర ప్రాంతాలకు టీటీడీ అధికారులు తరలించారు. అలాగే తిరుమల రెండో ఘాట్‌ రోడ్‌లో 13 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలను జేసీబీలతో టీటీడీ సిబ్బంది తొలగిస్తున్నారు.

నగరంలోని వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్దనున్న అండర్ బ్రిడ్జ్‌లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. నగరంలోని కరకంబాడి మార్గంలోనూ భారీగా వరద నీరు చేరింది. రహదారులు పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు కదలలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా రేణిగుంటలో దిగాల్సిన విమానాలు బెంగళూరు, హైదరాబాద్‌కు మళ్లిస్తున్నారు. భారీ వర్షంతో నీవా నది పొంగిపొర్లుతోంది. దొడ్డిపల్లి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి నీటి ప్రవాహంలో స్కూల్ బస్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. చిత్తూరు ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్ జలదిగ్బంధంలో చిక్కుకుంది.