కేసీఆర్ మహాధర్నా ఫై రేవంత్ సెటైర్లు

cm-kcr-fire-on-union-govt-on-paddy-procurement

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఫై పోరుబాట పట్టిన తెరాస సర్కార్ గురువారం ఇందిరా పార్క్ లో మహాధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి నుండి మొదలు పెడితే కింద స్థాయి నేతల వరకు ఈ ధర్నా లో పాలుపంచుకున్నారు. ఈ మహా ధర్నాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. జేఏసీ అంటే జాయింట్ యాక్టింగ్ కమిటీ అంటూ ఎద్దేవా చేశారు.

ధర్నా లో కేసీఆర్ ఏం మాట్లాడతారో అని ఎదురుచూశామని.. అక్కడ ఏర్పాట్లు చూస్తే పరేషాన్ అవుతారని రేవంత్ రెడ్డి అన్నారు. ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా కేసీఆర్ అని సూటిగా ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలనుకుంటే రైతుల కల్లాల వద్దకు వెళ్లాలని.. చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలని ఆయన అన్నారు. దమ్ముంటే పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని.. అసెంబ్లీలో తీర్మానం చేయాలని రేవంత్ అన్నారు. ఖరీఫ్ ధాన్యం కొంటవా లేదా అంటే యాసంగి ముచ్చట చెబుతుండంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో కరువొస్తే కాపాడేందుకు ఎఫ్‌సీఐ గోదాములను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.